శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (16:04 IST)

నీ కూతుర్ని చంపేశానంటూ అత్తకు అల్లుడి ఫోన్... ఆపై తాపీగా వీడియోలు చూస్తూ..

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను ఓ కసాయి భర్త ఏమాత్రం కనికరం లేకుండా కడతేర్చాడు. పైగా, అత్త మామలకు ఫోను చేసి.. మీ కుమార్తెను చంపేశాను అంటూ సమాచారం అందించాడు. ఆపై శవం పక్కనే కూర్చొని మొబైల్‌లో వీడియోలు చూస్తూ కూర్చొండిపోయాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జోధ్‌పూర్‌లో నివసించే విక్రమ్ సింగ్, శివ్ కన్వర్ అనే భార్యాభర్తలు ఉన్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఏ పని చేయకుండా తమను పట్టించుకోకపోవడంతో శివ్ కన్వర్ కుట్టుపని చేస్తూ, కుటుంబ పోషణ భారాన్ని మోసేది. 
 
కష్టపడి పనిచేసే భార్యతో విక్రమ్ సింగ్ తరచుగా గొడవ పడేవాడు. సోమవారం కూడా వారద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన విక్రమ్ సింగ్ చేతికందిన కత్తెర తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులోనే శివ్ కన్వర్ కుప్పకూలిపోయింది.
 
భార్య చనిపోయిందన్న బాధ కూడా లేకుండా విక్రమ్ సింగ్ ఆ విషయాన్ని అత్తమామలకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేసరికి శివ్ కన్వర్ విగతజీవురాలిగా పడివుంది. 
 
భార్య మృతదేహం పక్కనే కూర్చుని మొబైల్ ఫోనులో వీడియో గేములు ఆడుకుంటూ భర్త విక్రమ్ సింగ్ కనిపించాడు. దాంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు, శివ్ కన్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.