శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:44 IST)

కరోనా రోగిగా అనుమానించి కొట్టి చంపేశారు.. ఎక్కడ?

మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ వ్యక్తి కరోనా రోగి అని అనుమానించిన స్థానికులు అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బుధవారం జరుగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, థానే జిల్లాలోని కల్యాణ్‌ పట్టణానికి చెందిన గణేష్‌ గుప్తా అనే వ్యక్తి నిత్యావసర సరుకుల కోసం బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆయన వెళ్తున్న మార్గంలో పోలీసులు కనిపించేసరికి మరో దారిలో నడిచి వెళుతున్నాడు. 
 
అయితే, ఆయనకు ఒక్కసారిగా దగ్గురావడంతో పెద్దగా దగ్గాడు. దీంతో అక్కడున్న స్థానికులంతా కలిసి గుప్తాను కరోనా రోగిగా అనుమానించి చితకబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గుప్తా అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
 
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిచేసిన వ్యక్తులను గుర్తించేందుకు సమీపంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.