శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (09:05 IST)

సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు వ్యక్తిగతం - బీజేపీకి సంబంధం లేదు : కంగనా రనౌత్

Kangana Ranaut
గతంలో తెచ్చిన మూడు వివాదాస్పద సాగుచట్టాలను కేంద్రం రద్దు చేసింది. ఈ చట్టాలను మళ్లీ తీసుకునిరావాలంటూ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఈ సాగుచట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేశారు. వారికి అన్ని విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గి ఈ సాగు చట్టాలను రద్దు చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఈ సాగు చట్టాలను మళ్లీ తీసుకునిరావాలంటూ కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీకి తీవ్ర హాని చేసేలా ఉన్నాయి. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని  స్పష్టం చేశారు. అవి పూర్తిగా తన వ్యక్తిగతమని పేర్కొంటూ క్షమాణపలు చెప్పారు. పైగా, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు.
 
'గత కొద్ది రోజులుగా రైతుల అంశంపై మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో సాగు చట్టాలను తిరిగి తేవాలని రైతులు ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించాలని నేను సూచించాను. నా వ్యాఖ్యలు చాలా మందిని అసంతృప్తికి, నిరుత్సాహానికి గురిచేశాయి. ఇప్పుడు నేను కేవలం నటిని మాత్రమే కాదు. ఓ రాజకీయ నాయకురాలిననే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యక్తిగతంగా చెప్పిన అభిప్రాయమైనా సరే పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తుందనే విషయాన్ని తెలుసుకున్నా. నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నా. వాటిని వెనక్కి తీసుకుంటున్నా' అని ఎక్స్​లో పోస్ట్ చేశారు.
 
హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో జిల్లాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా రనౌత్‌ సాగు చట్టాలను అమల్లోకి తీసుకురావాలని వ్యాఖ్యానించారు. 'ఈ చట్టాలపై కొన్ని రాష్ట్రాలు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రద్దు చేసిన మూడు సాగు చట్టాలను మళ్లీ అమల్లోకి తీసుకురావాలి. రైతులు ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే ఈ చట్టాలను మళ్లీ అమలు చేయాలి. దేశాభివృద్ధికి అన్నదాతలే వెన్నెముక. అందుకే వారి శ్రేయస్సుకు ఉపయోగకరమైన ఆ చట్టాల కోసం రైతులే డిమాండ్‌ చేయాలి' అని అన్నారు. దీంతో కంగన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్‌ సహా విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.
 
అలాగే, కంగనా రనౌత్​ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఖండించారు. బీజేపీ తరపున అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదన్నారు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కంగన వివరణ ఇచ్చారు. అయితే కంగన వ్యాఖ్యలను బీజేపీ విభేదించడం ఇది రెండోసారి. గత నెలలో రైతు ఉద్యమాలతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అప్పుడు కూడా పార్టీ ఆమెను మందలించి, భవిష్యత్​లో ఇలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది.