శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (13:08 IST)

మాజీ సీఎం ఇంటి పెళ్లి.. సీరియస్ అయిన సీఎం.. నివేదిక కోరిన సర్కారు

కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఇంట ఓ శుభకార్యం జరిగింది. శుక్రవారం ఆయన కుమారుడి వివాహం రాంనగర జిల్లాలో ఉన్న సొంత ఫాంహౌస్‌లో ఈ వివాహం జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ఎలాంటి శుభకార్యాయాలు నిర్వహించరాదంటూ కేంద్రం ఆంక్షలు విధించింది.
 
కానీ, మాజీ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి ఇవేమీ పట్టించుకోకుండా ముందుగా నిర్ణయించిన ముహుర్తానికే తన కుమారుడి వివాహాన్ని జరిపించారు. దీనిపై కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సమయంలో పెళ్లి జరపడంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాంనగర డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
ఈ విషయమై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వథ్ నారాయణ్, ఈ పెళ్లిపై చర్యలు తీసుకోకుంటే, వ్యవస్థను వెక్కిరించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఎస్పీతోనూ మాట్లాడామని, వివాహం జరిపించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. 
 
కాగా, బెంగళూరులోని రామ్ నగర్ పరిధిలోని కేతగానహళ్లిలో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో నిఖిల్ గౌడకు, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కృష్ణప్ప మనవరాలు రేవతిల వివాహం అత్యంత సాదాసీదాగా శుక్రవారం ఉదయం జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాహానికి కేవలం ఇరు కుటుంబాల పెద్దలతో పాటు అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.