శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 మే 2018 (14:28 IST)

కర్ణాటకలో సంచలనం... జేడీఎస్‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్... సీఎంగా కుమారస్వామి?

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పాటుకానుంది. అయితే, భారతీయ జనతా పార్టీ మాత్రం 106 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు

కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పాటుకానుంది. అయితే, భారతీయ జనతా పార్టీ మాత్రం 106 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి 73, జేడీఎస్‌కు 41 సీట్లు రాగా, ఇతరులకు రెండు స్థానాలు ఉన్నాయి. దీంతో ఏ ఒక్క పార్టీ కూడా సొంత బలంపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు.
 
ఈనేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కకుండా ఉండేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులోభాగంగా, 41 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాని దేవెగౌడకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్ చేసి హామీ ఇచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. 
 
మరోవైపు.. బెంగుళూరులో మకాంవేసివున్న కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌లు దేవెగౌడ నివాసానికి వెళ్లి ఆయనతో మంతనాలు జరుపనున్నారు. ఈ చర్చల్లో జేడీఎస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కుమార స్వామి కూడా పాల్గొననున్నారు. ఫలితాలతో నిమిత్తం లేకుండా బీజేపీ మాత్రం అధికారంలోకి రాకుండా సోనియా గాంధీ పావులు కదుపుతున్నారు. 
 
నిజానికి కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు కావాలి. తొలుత క్లియర్ మెజారిటీ దిశగా వెళ్లిన బీజేపీ ఆధిక్యత ఆ తర్వాత తగ్గింది. ప్రస్తుతం ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 6 సీట్ల వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. 
 
ఈ తరుణంలో బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్‌కు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే జరిగితే కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.