సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (12:11 IST)

ఇద్దరిని ప్రేమించిన యువకుడు.. లాటరీ ద్వారా యువతి ఎంపిక?

ఓ యువకుడు ఇద్దరిని ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటే తనను చేసుకోవాలంటూ ఇద్దరూ పట్టుబట్టడంతో విషయం గ్రామ పెద్దల దృష్టికి చేరింది. దీంతో ఏం చేయాలో పాలుపోని గ్రామస్థులు చివరికి లాటరీ తీసి ఒక అమ్మాయితో వివాహం జరిపించారు. ఈ ఘటన కర్నాటకలోని హసన్ జిల్లాలో జరిగింది. 
 
సకలేశపుర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఇంటర్నెట్ సాయంతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు యువతులను ప్రేమించాడు. ఈ క్రమంలో అతడిని పెళ్లి చేసుకోవాలని యువతులిద్దరూ భావించి గ్రామానికి వచ్చారు. దీంతో యువకుడు తనను కాకుండా మరొకరిని ప్రేమిస్తున్న విషయం యువతులు ఇద్దరికీ తెలిసింది. దీంతో ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న సమస్య గ్రామ పెద్దల పంచాయతీకి చేరింది. 
 
అయితే, అతడు లేకుంటే తాను బతకలేనంటూ ఓ యువతి విషం తాగింది. దీంతో గ్రామస్థులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కోలుకున్న ఆమె తాజాగా మరోమారు గ్రామానికి వచ్చింది. సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. 
 
దీంతో బాగా ఆలోచించిన గ్రామ పెద్దలు ఓ మార్గాన్ని కనిపెట్టారు. ఇద్దరి పేర్లను లాటరీ తీసి ఎవరి పేరు వస్తే వారే అతడిని పెళ్లి చేసుకోవాలని, పేరు రాని యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని షరతు విధించారు. ఇందుకు యువతులిద్దరూ అంగీకరించారు.
 
ఇక లాటరీ తీయగా విషం తాగి ఆసుపత్రి పాలైన యువతి పేరు వచ్చింది. దీంతో శుక్రవారం ఆమెతో యువకుడి వివాహం జరిపించారు. మరోవైపు, లాటరీలో ఓడిపోయిన యువతి వారికి శుభాకాంక్షలు చెబుతూనే, తనను మోసం చేసిన ప్రియుడిని వదిలిపెట్టబోనని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.