బంపర్ లాటరీపై ఆశ - రూ.3.5 కోట్లు వెచ్చించిన కేరళ వాసి
ఒకే ఒక్క బంపర్ లాటరీ గెలిస్తే జీవితంలో స్థిరపడిపోవచ్చన్న ఆశ ఓ వ్యక్తితో 52 యేళ్ల పాటు లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించింది. ఈ మధ్య కాలంలో ఆయన లాటరీ టిక్కెట్ల కోసం వెచ్చించిన మొత్తం రూ.3.5 కోట్లు. తన 18 యేళ్ల ప్రాయం నుంచి లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేయడం మొదలు పెట్టిన ఆయన 52 యేళ్లుగా టిక్కెట్లు కొనుగోలు చేస్తూనే వున్నాడు. కానీ, ఆయన కోరిక మాత్రం తీరలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు ఆపబోనని, మున్ముందు కూడా లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తూనే ఉంటానని చెప్పారు.
ఆయన పేరు రాఘవన్. కేరళ రాష్ట్రంలోని కన్నౌర్ వాసి. రోజుకు పది లాటరీ టికెట్ల చొప్పున కొంటున్న రాఘవన్ ఇందుకోసం ఇప్పటివరకు ఏకంగా రూ.3.5 కోట్లు ఖర్చు చేశాడు. ఇంతా చేసి ఇప్పటివరకు లాటరీల్లో అతను గెలుచుకున్న గరిష్ఠ బహుమతి రూ.5 వేలు మాత్రమే.
తనకు వచ్చే ఆదాయంలో కొంతమొత్తాన్ని లాటరీ టికెట్ల కోసం ఖర్చు చేస్తున్నాడు. కేరళలో అత్యంత ఖరీదైన ఓనమ్ బంపర్ లాటరీని కూడా అతడు కొనుగోలు చేశాడు. ఆ టికెట్లన్నీ భద్రంగా గోనె సంచుల్లో నిల్వ చేసి అదృష్టం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా తన భర్తకు అదృష్టం కలిసి వస్తుందని రాఘవన్ భార్య శాంత ఆశాభావంతో ఉంది.