గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (20:08 IST)

వీడియో కాల్ ద్వారా మహిళకు ప్రసవం.. శిశువు మృతి

వీడియో కాల్ ద్వారా మహిళకు ప్రసవం చేశాడు ఓ వైద్యుడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ శిశువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గర్భంతో ఉన్న పుష్ప (33) సునంబేడు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ ఆస్పత్రికే రెగ్యులర్ చెకప్​లకు వెళ్తోంది. 
 
సోమవారం (సెప్టెంబర్ 19న) బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఇందుకోసం భర్త మురళితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. మహిళను పరీక్షించిన వైద్యుడు.. పురుటి నొప్పులు వచ్చినప్పుడు ఆస్పత్రికి రావాలని చెప్పాడు. 
 
ప్రస్తుతానికి ఇంటికి వెళ్లిపోవాలని సూచించాడు. అయితే, అదే రోజు మధ్యాహ్నం పుష్పకు నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అక్కడ నర్సులు తప్ప వైద్యుడు లేడు.
 
అంతకుముందు నిర్వహించిన పరీక్షల్లో పుష్పకు సమస్యలు ఉన్నట్లు తేలింది. అయితే, అవేవీ తెలుసుకోకుండా నర్సులు.. నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. అప్పుడే వీరికి అసలు సమస్య ఎదురైంది. 
 
డెలివరీ చేస్తుండగా సాయంత్రం ఆరు గంటల సమయంలో శిశువు కాళ్లు బయటకు రావడాన్ని గమనించారు. దీంతో గర్భంలో శిశువు అడ్డం తిరిగినట్లు నిర్ధరణకు వచ్చారు. వెంటనే వైద్యుడిని సంప్రదించారు.
 
డాక్టర్.. వీడియో కాల్ ద్వారా నర్సులకు సూచనలు చేశాడు. నర్సులు అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ శిశువు తల బయటకు రాలేదు. ఇక చేసేదేం లేక, పుష్పను మదురంతగమ్ జీహెచ్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. 
 
పుష్పను అంబులెన్సులో ఎక్కించారు. అయితే, మదురంతగమ్ ఆస్పత్రికి చేరుకునే ముందే శిశువు తల బయటకు వచ్చింది. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. బయటకు వచ్చింది మృతశిశువు అని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.