గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (12:24 IST)

ఉగ్రవాదులారా... ప్రజలను కాదు.. ఏళ్ళతరబడి రాష్ట్రాన్ని దోచుకున్నవారి చంపండి... జేకే గవర్నర్

జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నోరుజారారు. ఆ తర్వాత నాలిక్కరుచుకున్నారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడం మానుకోవాలని కోరారు. అదేసమయంలో ఏళ్ళ తరబడి రాష్ట్రాన్ని దోచుకున్న వారిని కాల్చి చంపాలంటూ పిలుపునిచ్చారు. ఆ తర్వాత తేరుకుని తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. పొరపాటున నోరు జారినట్టు చెప్పారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కార్గిల్‌లోని ఖ్రీ సుల్తాన్ ఛూ స్టేడియంలో లడక్ టూరిజం ఫెస్టివల్-2019ను గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తుపాకులతో రాజ్యం చేయాలని చూస్తున్న ఉగ్రవాదులు తోటి ప్రజల్ని చంపుతున్నారని, వీరు చంపాల్సింది కాశ్మీర్‌ను దోచుకుంటున్న వారినని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తేరుకుని తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకోరాదంటూ మీడియా ముందుకు వచ్చి వివరణ కూడా ఇచ్చారు. 
 
అయితే, గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఎన్.సి.పి. నేత ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ గవర్నర్‌ మాటలు రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో ఇకపై ఏ రాజకీయ నాయకుడుగాని, అధికారిగాని చనిపోతే అది గవర్నర్‌ ఆదేశాల మేరకు జరిగిందని భావించాల్సి ఉంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ జి.ఎ.మిర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అటవిక రాజ్యాన్ని పోషిస్తున్నారా? అని ప్రశ్నించారు.