శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (13:58 IST)

చర్చ లేకుండా సాగు చట్టాలకు మంగళం పాట - విపక్షాల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మూడు వివాదాస్పద సాగు చట్టాలకు మంగళంపాట పాడింది. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే ఈ సాగు చట్టాలను రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై ఎలాంటి చర్చా లేకుండానే లోక్‌సభ ఆమోముద్ర వేసింది. దీంతో గత యేడాదిన్నర క్రితం తెచ్చిన సాగు చట్టాలు రద్దు అయ్యాయి. 
 
ఈ సాగు చట్టాల రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి తోమర్ ప్రవేశపెట్టారు. అదేసమయంలో విపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. సాగు చట్టాల రద్దుపై చర్చించాలంటూ పట్టుబట్టారు. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి చర్చకు గట్టిగా పట్టుబట్టారు. తెరాస సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. చర్చ లేకుండా సాగు చట్టాలను రద్దు చేయడాన్ని విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబట్టాయి. 
 
కానీ, ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఈ సాగు చట్టాలను రద్దు చేసింది. అయితే, సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మొత్తంమీద రైతుల ఆందోళనకు దిగివచ్చిన కేంద్రం ఈ వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసింది.