ఎమ్మెల్సీగా నా డ్యూటీ నేను చేస్తున్నా... సీఎం చొక్కాపట్టుకో అనలేదే...
గుంటూరు జిల్లాలో ఓ బాధిత కుంటుంబాన్ని పరామర్శించాలని బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న లోకేష్ ను బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.
నారా లోకేష్ గుంటూరు పర్యటనకు వెళ్లడానికి పర్మిషన్ లేదని, అందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెప్పారు. దీనితో లోకేష్ పోలీస్ అధికారులతో వాదనకు దిగారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
నేను రాజ్యాంగ పరంగా నడుచుకుంటున్నా... నా హక్కు ప్రకారం నన్ను వెళ్లనివ్వండి... ఒక బాధితురాలిని పరామర్శించేందుకు నేను వెళుతున్నా... ఒక ఎం.ఎల్.సిగా నా డ్యూటీ నేను చేస్తున్నా... నాపైన ఎలాంటి కేసులు లేవు. ఎవరిపైనా దాడి చేసిన, దుర్భాషలాడిన కేసులేమీ లేవు. ఒక్క ట్రాక్టర్ రాష్ డ్రైవింగ్ కేసు తప్ప ఏం లేదు అని లోకేష్ వివరణ ఇచ్చారు.
మేం అక్కడికి వెళ్లి ఏం గొడవ చేయట్లేదే? ఒక బాధితురాల కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పేందుకు వెళుతున్నా... అంతేగాని, సీఎం చొక్కా పట్టుకోమని నేను ఎపుడూ చెప్పలా... అయినా ఆంధ్రలో ఎక్కడా లేని లా అండ్ ఆర్డర్ రూల్స్ ని గుంటూరులో ఎందుకు అమలు చేస్తున్నారు? అని నారా లోకేష్ ప్రశ్నించారు. నారా లోకేష్ పోలీసు అధికారులతో చేసిన వాగ్వాదం మొత్తాన్ని ఆయన అనుచరులు వీడియో తీసి వైరల్ చేస్తున్నారు.