అక్కాచెల్లెళ్లకు పెళ్లి.. తాళి కట్టే సమయంలో కరెంట్ పోయింది.. చివరికి?
అక్కాచెల్లెళ్లకు ఒకే ముహూర్తంలో పెళ్లి కుదిరింది. ఒకే వేదికపై మూడు ముళ్లు వేసేందుకు ఆ యువతులు సిద్ధంగా వున్నారు. అయితే వున్నట్టుండి కరెంట్ పోయింది. పెళ్ళి మంటపంలో చీకట్లు కమ్ముకున్నాయి. అక్కాచెల్లెళ్లు ఒకే రకమైన పెండ్లి దుస్తుల్లో ఉండటంతో పొరబడిన చెల్లెలి కాబోయే భర్త ఆమె అక్కను మనువాడాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
అక్కను పెళ్లి చేసుకోవాల్సిన వరుడు ఆమె చెల్లెలి మెడలో వరమాల వేశాడు. రమేష్‌లాల్ ఇద్దరు కూతుళ్లు నికిత, కరిష్మాలకు ఆదివారం రాత్రి దంగ్వార భోలా, గణేష్‌లతో పెండ్లి జరగాల్సి ఉండగా జంటల విషయం తారుమారైన సంగతి ఎవరూ గుర్తించలేదు.
పురోహితుడు సైతం పెండ్లి కుమార్తెలు అటుఇటు అయిన సంగతి చూసుకోకుండా వివాహ తంతు జరిపించాడు. దాంతో అప్పటివరకు ముసుగు కప్పుకొని ఉన్న వధువులను వారి భర్తలు చూసి ఖంగుతిన్నారు. వధువులు మారిపోయారని గ్రహించి తిరిగి వధువుల తండ్రి ఇంటికి వెళ్లి జరిగిన పొరపాటును వాళ్లకు చెప్పేశారు.
దాంతో వధువులను మార్చి మరుసటిరోజు మళ్లీ పెళ్లి జరిపించాడు రమేష్ లాల్. కాగా, ఇద్దరు వధువులు ముసుగుతో పాటు ఒకేలాంటి డ్రెస్ వేసుకోవడంతో వరుళ్లతో పాటు పెద్దలు కూడా ఈ పొరపాటును గమనించలేకపోయారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.