మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:44 IST)

యువ ఐఏఎస్‌కు కరోనా వైరస్.. సెల్ఫ్ క్వారంటైన్‌కు కొలీగ్స్

కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. కరోనా వైరస్ బారినపడిన వారికి సేవలు చేస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారిని కాటేసింది. దీంతో ఆయనతో పాటు ఉండే కార్యాలయ సిబ్బందితో పాటు కొలీగ్స్ అంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఓ యువ ఐఏఎస్ అధికారి పనిచేస్తున్నారు. ఈయన కరోనా రోగులకు వైద్య సేవలు చేయించే పనుల్లో తీవ్రంగా నిమగ్నమయ్యారు. అయితే, ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 
 
అంతేకాకుండా, ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. వీరిలో రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఆరోగ్య శాఖకు చెందిన 120 మంది అధికారులు, సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కోవిడ్-19 పరీక్షల కోసం పంపినట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు.