బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (07:30 IST)

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోండి: కేంద్రం

కోవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలో అందుబాటులోకి రాబోతున్న నేపధ్యంలో అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి నిల్వలు, పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సూచించారు.

దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో భాగంగానే చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌తో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 
 
ప్రత్యేకించి కంటైన్‌మెంట్‌ జోన్‌లలో పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 4.5 లక్షలు వరకు ఉన్నాయని, రికవరీశాతం కూడా పెరుగుతోందన్నారు. కంటైన్‌మెంట్‌ల నిర్వహణ, టెస్టుల సంఖ్యను పెంచాలన్నారు.

వీటి వల్ల కోవిడ్‌ కేసులను ముందే గుర్తిస్తే సమాజంలో వ్యాప్తిని నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు, ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌పంపిణీ ఏ విధంగా జరగాలన్న దానిపై కూడా మరింత క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. 
 
డిసెంబరు 6వ తేదీ నాటికి ఆయా రాష్ర్టాలు రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీలు, టాస్క్‌ఫోర్స్‌ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అలాగే జిల్లా, బ్లాక్‌స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. కోల్డ్‌స్టోరేజీలు, వ్యాక్సిన్‌రవాణాకు సంబంధించి మౌలిక సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవాలని చెప్పారు. 
 
వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రాధాన్యనిచ్చే వర్గాలతో ఎప్పటికప్పుడు పారదర్శకంగా సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవి గుప్త, అడిషనల్‌ డీజీ జితేందర్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) వికాస్‌రాజ్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.