మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (13:11 IST)

జి-20 సదస్సు : కాంగ్రెస్ అధినేతకు దక్కని రాష్ట్రపతి విందు ఆహ్వానం

mallikarjuna kharge
ఢిల్లీ వేదికగా జి20 సదస్సు జరుగనుంది. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మొత్తం 19 దేశాలకు చెందిన అతిథులు ఈ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ క్రమలో అతిథులతో పాటు మాజీ ప్రధానులకు జీ20 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆహ్వానాలు పంపించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ వృద్ధ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఈ ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని ఖర్గే కార్యాలయం ధ్రువీకరించింది. 
 
ఇందులో కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ విందు ఆహ్వానితులు, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో భాగంగానే కేబినెట్‌ హోదా కలిగిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన ఖర్గేకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ విందులో పాల్గొనబోతున్నట్టు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన నీతీశ్‌ కుమార్‌, హేమంత్‌ సోరెన్‌, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్, ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో ఈ విందు జరగనుంది. దీంతోపాటుగా  సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.