కరోనా మందులపై జీఎస్టీనా? ప్రధాని మోడీని ప్రశ్నించిన సీఎం మమత

mamata banerjee
ఠాగూర్| Last Updated: ఆదివారం, 9 మే 2021 (17:35 IST)
కరోనా వైరస్‌ రోగులకు వాడే మందులపై కూడా కేంద్ర ప్రభుత్వం పన్నులు వసూలు చేయడాన్ని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పబట్టారు. కొవిడ్‌-19పై పోరాటంలో వైద్య పరికరాలు, మందుల‌పై పన్నులు మాఫీ చేయాల్సిందిగా ఆమె కోరారు. ఈ మేరకు ప్రధాన మోడీకి ఆమె ఓ లేఖ రాశారు.

అదేవిధంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలని, కరోనా వైరస్ పాజిటివ్ రోగుల చికిత్స కోసం పరికరాలు, మందులు, ఆక్సిజన్ సరఫరాను పెంచాలని మ‌మ‌తా బెన‌ర్జీ కోరారు.

ఆక్సిజ‌న్ కాన్స‌ట్రేట‌ర్స్‌, సిలిండ‌ర్లు, కంటైనర్లు, కొవిడ్ సంబంధిత డ్ర‌గ్స్‌ను ప్ర‌భుత్వానికి అందించేందుకు వ్య‌క్తిగ‌తంగానూ, సంస్థ‌లు కూడా ముందుకు వ‌స్తున్న‌ాయని, అందువల్ల వీటిని ఎస్‌జీఎస్‌టీ, సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ ప‌రిధిలోంచి తొల‌గించాల్సిందిగా ఆమె కోరారు.

పైన తెలిపిన‌వ‌న్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తున్న నేప‌థ్యంలో రోగుల ప్రాణాల‌ను కాపాడే మందులు, ప‌రికరాల స‌ర‌ఫ‌రాకు అడ్డంకులు తొల‌గించాల్సిందిగా అభ్య‌ర్థిస్తున్న‌ట్లు తెలిపారు. కొవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ‌కు ఈ చ‌ర్య దోహ‌దం చేస్తుంద‌ని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.

బీహార్‌లో దారుణం.. మోడీ ఆందోళన
మరోవైపు, బిహార్‌ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పరిస్థితుల‌ను అధిగమించేందుకు అక్క‌డి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్‌ విధించింది. ఈ లాక్డౌన్ ఈ నెల‌ 15 వరకు అమలులో ఉంది. అయినప్పటికీ కొత్త కేసుల నమోదులో ఏమాత్రం తగ్గలేదు.

అందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్ విధించిన‌ప్ప‌టికీ పాజిటివ్‌సుల సంఖ్య పెరగ‌డం ప‌ట్ల ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు. ఆదివారం ఆయ‌న బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. క‌రోనా వైర‌స్ క‌ట్టడికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, రాష్ట్రానికి సాధ్య‌మైనంత‌ సహాయం చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.

పంజాబ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో కూడా ప్ర‌ధాని మోడీ మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో క‌రోనా నివార‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. కరోనా చైన్‌ను విడ‌గొట్ట‌డానికి ఖచ్చితంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో టీకా గురించి సమాచారం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా బిహార్ ఆరోగ్య సేవల గురించి నితీష్ కుమార్ ప్రధానికి తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :