ఈసీని ఏకిపారేసిన మమతా బెనర్జీ ... మోడీ తొత్తుగా మారిందంటూ..
కేంద్ర ఎన్నికల సంఘంపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ తొత్తుగా మారిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీ మాట్లాడుతూ, పారదర్శకంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం చెప్పినట్టల్లా ఈసీ తోకాడించడం కరెక్టు కాదని, ఇకపై ఇలా జరుగకుండా కేంద్ర ఎన్నికల సంఘంలో తక్షణ సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసపై కేంద్రం నిజనిర్ధారణ కమిటీ వేయడం, గవర్నర్‌ను నివేదిక కోరడం లాంటి ఘటనలపై కూడా మమత ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 24 గంటలైనా గడువకముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై కక్ష్యపూరిత చర్యలకు పూనుకున్నదని ఆమె విమర్శించారు. బెంగాల్ ప్రజల తీర్పును బీజేపీ నేతలు భరించలేక పోతున్నారని మమత ఎద్దేవా చేశారు.
బెంగాల్‌కు వెన్నెముక ఉన్నదని, ఇక్కడ ప్రజలు ఎవరికీ లొంగరని మమతా బెనర్జి తేల్చి చెప్పారు. బీజేపీ, ఎన్నికల సంఘం, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి అంతా బెంగాల్‌లో తిష్టవేసి కుట్ర చేసినా వారికి ఓటమి తప్పలేదని అన్నారు.
తనను ఓడించడం కోసం వారు విమానాలకు, హోటళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, రాష్ట్రంలో డబ్బును వరదలా పారించారని, అయినా వాళ్ల పాచికలు పారలేదని మమత చెప్పారు. భవిష్యత్‌లో కమలనాథులో పాచికలు పారవని ఆమె జోస్యం చెప్పారు.