గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (15:07 IST)

ఈశాన్య భారతంలో కార్చిచ్చు : బుగ్గిపాలవుతున్న అడవులు

ఈశాన్య భారత రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్ సరిహద్దుల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. ఈ కార్చిచ్చు వందలాది ఎకరాల్లో అడవులను కాల్చి బూడిద చేస్తోంది. ఇటీవల నాగాలాండ్ లోని జూకో లోయలో ఈ మంటలు చెలరేగాయి. ఇవి నెమ్మదిగా మణిపూర్ వరకు విస్తరించి, చివరకు మౌంట్ ఇసో వరకు వ్యాపించాయి. దీంతో మంటలను అదుపు చేసేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగింది. 
 
దాంతో పాటు సైన్యం, పారామిలటరీ బలగాల సాయమూ కోరినట్టు అధికారులు చెబుతున్నారు. నాగాలాండ్ వైపే కార్చిచ్చు చెలరేగిందని మణిపూర్‌లోని సేనాపతి జిల్లా అటవీ అధికారి చెప్పారు. గత నెల 28 నుంచి అడవి మండుతూనే ఉన్నట్టు సరిహద్దు గ్రామాల ప్రజల ద్వారా తెలుస్తోందని ఆయన చెప్పారు.
 
ప్రస్తుతం ఆయా గ్రామాల్లోని 130 మంది ప్రజలు, అటవీ అధికారులు కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశామని చెప్పారు. అయితే, గాలుల వేగం, తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. కార్చిచ్చుల వల్ల చాలా వరకు వృక్ష, జంతు జాతులు బుగ్గయ్యాయని మణిపూర్ మావో మండలి పేర్కొంది. మంటలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.