దేశంలో కరోనా కరాళనృత్యం.. సొంతూళ్ళకు క్యూ కట్టిన వలస కార్మికులు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కరాళ నృత్యం చేస్తుంది. రోజురోజుకూ కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా లాక్డౌన్ విధిస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకే బతుకుదెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వలసకార్మికులు.. మూటాముల్లె సర్దుకుని స్వస్థలాలకు తిరుగు పయనం అవుతున్నారు.
ఫలితంగా ప్రధాన నగరాల్లోని బస్‌స్టాపులు, రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏ క్షణంలో అయినా లాక్డౌన్ ప్రకటించవచ్చు. అందుకే తాము స్వస్థలాలకు వెళ్తున్నాం. గత ఏడాది లాక్డౌన్ సందర్భంగానే తాము చాలా ఇబ్బందులు పడ్డాం. ఈసారి కూడా అలాంటి సమస్యలను ఎదుర్కొదల్చుకోలేదు అని ప్రయాణికులు చెబుతున్నారు.
మరోవైపు, దేశంలో కరోనా రెండో దశ సంక్రమణ శరవేగంగా సాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 12 రోజుల్లో డబుల్ అవుతున్నాయి. 8 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 16.69 శాతానికి పెరిగింది. అలాగే గత నెలలో వారాంత పాజిటివిటి రేటు కూడా 3.05 శాతం నుంచి 13.54 శాతానికి పెరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికంగా వీక్లీ పాజిటివిటి రేటు 30.38 శాతంగా ఉన్నది. 24.24 శాతంతో గోవా, 24.17 శాతంతో మహారాష్ట్ర, 23.33 శాతంతో రాజస్థాన్, 18.99 శాతంతో మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.