సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (14:09 IST)

ఆఫీసు నుంచి 2 నిమిషాలు తొందరగా వెళ్ళిందని.. ఏం చేశారో తెలుసా..?

ఆఫీసు నుంచి రెండు నిమిషాలు తొందరగా వెళ్లిందనే కారణంగా ఓ మహిళకు తన జీతంలో 10 శాతం కోత విధించింది జపాన్ సంస్థ. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని చీబా ఫునాబాషి సిటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తన ఉద్యోగి కార్యాలయం నుంచి రెండు నిమిషాలు తొందరగా ఇంటికి వెళ్లిందనే కారణంతో వేతనంలో కోత విధించింది సంస్థ.

వివరాల్లోకి వెళ్తే.. మే 2019 నుంచి జనవరి 2021 మధ్య కాలంలో దాదాపు 316 సార్లు ఉద్యోగులు త్వరగా నిష్క్రమించారనే విషయం మేనేజ్మెంట్ దృష్టికి వెళ్లింది. అంతేకాకుండా అన్ని సందర్భాల్లోనూ ఉద్యోగులు తమ కార్డులో తప్పుడు సమయాన్ని రాశారని యాజమాన్యం తెలుసుకుంది.
 
దీంతో లెఫ్లాంగ్ లెర్నింగ్ డిపార్ట్మెంటులో అసిస్టెంట్ సెక్షన్ ఛీఫ్ అయిన 59 ఏళ్ల మహిళా ఉద్యోగిపై కొరడా ఝుళిపించింది. ఇతర ఉద్యోగులు త్వరగా పని ముగించుకొని వెళ్లడానికి సహాయపడినందుకు గాను ఆమెకు శిక్షగా మూడు నెలల వరకు జీతంలో 10వ వంతు కోత విధించింది. నివేదికల ప్రకారం శిక్షకు గురైన ఈ మహిళ తన లాగ్ అవుట్ టైం 05.15PM కంటే రెండు నిమిషాల ముందే పని నుంచి నిష్క్రమిస్తుంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. సాయంత్రం 05.17 గంటలకు ఇంటికి వెళ్లే బస్సును అందుకోవడానికి ఆమె అలా చేస్తోంది.
 
ఈమెతో పాటు మరో ఇద్దరు సిబ్బందికి యాజమాన్యం రాతపూర్వక హెచ్చరికలు జారీచేసింది. మరో నలుగురికి కఠినమైన నోటీసులు ఇచ్చింది. అధికారులు తమ ఉద్యోగులపై అసమంజసంగా, కఠినంగా వ్యవహరించిన ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో త్వరగా వైరల్ అయింది. దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చకు దారితీసింది. జపాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు.