ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:53 IST)

సుప్రీం ఈమెయిల్ నుంచి ప్రధాని ఫోటో తొలగింపు

సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి లాయర్లకు వెళ్లే ఈ-మెయిల్ కింద భాగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచార చిత్రం ఉండటంపై అత్యున్నత న్యాయస్థానం (ఎస్‌సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
రిజిస్ట్రీ అభ్యంతరంపై తక్షణమే స్పందించిన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆ ప్రచార చిత్రాన్ని తొలగించింది. ఆ ఫోటో స్థానే విద్యుత్ వెలుగుల్లో ఉన్న సుప్రీంకోర్టు భవనం ఫోటోను పెట్టింది.
 
దేశ 75వ స్వాతంత్ర్య అమృతోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారిక వెబ్‌సైట్ల, ఈ-మెయిల్స్‌లో 'సబ్‌కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' నినాదంతో పాటు మోడీ ఫోటోతో కూడిన ప్రచార చిత్రాన్ని ఉంచుతోంది. 
 
సుప్రీంకోర్టు నుంచి వెళ్లే అధికారిక ఈ-మెయిల్ కింద భాగంలో కూడా దీన్ని ఉంచింది. ఈ విషయాన్ని కొందరు లాయర్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దృష్టికి తీసుకు వెళ్లడంతో రిజిస్ట్రీ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. 
 
న్యాయవ్యవస్థ కార్యకలాపాలతో సంబంధం లేని ఓ ఫోటోను సుప్రీంకోర్టు అధికారిక ఈ-మెయిల్‌ అడుగు భాగంలో పొందుపరచడం సరికాదని స్పష్టం చేసింది. వెంటనే ఆ బొమ్మని తొలగించాలని ఎన్‌ఐసీని ఆదేశించింది. దీనిపై తక్షణ చర్యలకు దిగిన ఎన్‌ఐసీ.. సుప్రీంకోర్టు ఈ-మెయిల్ కింద భాగంలోని మోదీ ప్రచార చిత్రాన్ని తొలగించింది.