సంతానం లేదని ఆస్పత్రికి వెళ్తే.. పురుషుడి శరీరంలో గర్భసంచి వుందని?
వివాహమై రెండేళ్లయ్యింది. అయితే తమకు సంతానం కలగలేదని సదరు వ్యక్తి వైద్య పరీక్షల కోసం ముంబై జేజే ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతనిని పరీక్షించిన వైద్యులు షాకయ్యారు. 29 సంవత్సరాల ఆ వ్యక్తి శరీరంలో గర్భసంచి వున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. అండాశయాలు జీర్ణాశయానికి అతుక్కుని ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆ వ్యక్తి మహిళా, పురుషుడా అనేది తేల్చేందుకు పరీక్షలు నిర్వహించారు.
లింగపరంగా పురుషుడేనని వైద్యులు నిర్ధరించారు. వివిధ పరీక్షల అనంతరం శస్త్రచికిత్స ద్వారా గర్భసంచిని విజయవంతంగా తొలగించి, ఆ తర్వాత మరో సర్జరీ ద్వారా అండాశయాలను వృషణాల్లో అమర్చినట్లు చెప్పారు.
ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 200 మంది పురుషుల శరీరాల్లో గర్భసంచి ఉన్న ఘటనలు నమోదయ్యాయి. జేజే ఆసుపత్రిలో మాత్రం ఇదే తొలి కేసు కావడం గమనార్హం. పురుషుడి శరీరంలో గర్భసంచి బయటపడిన అరుదైన శస్త్రచికిత్సను విజయవంతం చేశామని వైద్యులు ప్రకటించారు.