శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జనవరి 2022 (12:59 IST)

ముంబై: 20 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

ముంబైలోని ఓ 20 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించి చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రమాదంలో ముగ్గురు ఊపిరాడక చనిపోయారు.
 
ముంబై నగరంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఏడుకు చేరింది. మరో 14 మంది గాయపడ్డారు. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి.
 
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. గాయపడినవారిని అధికారులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
 
ఆరుగురు వృద్ధులకు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నామని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ వెల్లడించారు. కమలా బిల్డింగ్‌లో 18వ అంతస్తులో ఉదయం 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయన్నారు.
 
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 13 అగ్నిమాపక యంత్రాలతో మంటలను మంటలను అదుపులోకి తెచ్చారు. 
 
భాటియా ఆస్పత్రిలో 15 మంది క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. వీరిలో 12 మంది సాధారణ వార్డు, ముగ్గురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.