శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (12:59 IST)

భారీ వర్షాలు... ముంబైకు ఆరెంజ్ అలెర్ట్ ... హిమాచల్ ప్రదేశ్‌లోనూ...

mumbai rains
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా ఉత్తర భారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, ఈశాన్య భారతంలో మరింత ఉధృతంగా కురుస్తున్నాయి. అలాగే, దేశ వాణిజ్య రాజధాని ముంబైని కూడా ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. 
 
అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలు మునిగిపోవడంతో స్థానిక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు.
 
ముంబైలో గత సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే శుక్రవారం వరకు ముంబయి సహా శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబైకి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.
 
ముంబై సహా ఠాణే, పాల్ఘర్‌ జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తాయి. ఠాణేలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై గుంత కారణంగా కింద పడ్డాడు. అదేసమయంలో వచ్చిన బస్సు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
rain water
 
వర్షాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే మంగళవారం అధికారులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
 
మరోవైపు, హిమాచల్‌ప్రదేశ్‌లోనూ మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కులూ జిల్లాలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉద్ధృతిలో ఆరుగురు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. 
 
వారి కోసం గాలింపు చేపట్టామన్నారు. వరదల కారణంగా జిల్లాలోని మలానా, మణికరణ్‌ గ్రామాలకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. సిమ్లాలోని ధల్లీ టన్నెల్ వద్ద కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతిచెందారు. అటు బిహార్‌లోనూ భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.