ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (07:17 IST)

కర్నాటకలో కరోనా కలకలం : మైసూర్ ప్యాలెస్ మూసివేత

కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడు కర్నాటక రాష్ట్రం కూడా చేరిపోయింది. దీంతో ప్రఖ్యాత మైసూర్ ప్యాలెస్‌ను మూసివేశారు. ఈ ప్యాలెస్‌లో పని చేసే ఉద్యోగి బంధువులకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు ఈ ప్యాలెస్‌ను మూసివేశారు. 
 
అయితే శానిటైజేషన్ తర్వాత మళ్లీ సోమవారం తెరిచే అవకాశమున్నట్లు సమాచారం. తొలుత కరోనా కారణంగా మార్చి 15 నుంచి 22 వరకూ వారం రోజుల పాటు ప్యాలెస్‌ను మూసివేసినట్లు ప్యాలెస్ కమిటీ తెలిపింది. 
 
ఇదిలావుంటే.. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
కొత్తగా కర్ణాటకలో 2,228 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 1,373 కేసులు బెంగళూరులోనే నమోదు కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా కొంత ఆందోళనకరంగానే ఉంది. గత 24 గంటల్లో కర్ణాటకలో కరోనా వల్ల 17 మంది మరణించారు. దీంతో.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 486కు చేరింది.