శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 అక్టోబరు 2021 (13:13 IST)

కోయంబత్తూరులో నీట్‌కు మరో విద్యార్థిని బలవన్మరణం

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాలో నీట్ పరీక్ష మరో విద్యార్థి ప్రాణాలు తీసింది. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షా ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. దీంతో ఓ విద్యార్థి ఉత్తీర్ణతపై భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
కోయంబత్తూరు జిల్లా పుదూర్‌కుప్పంకు చెందిన కుప్పుస్వామి-వలర్మతి దంపతుల కుమారుడు కీర్తివాసన్‌ (20) ప్లస్‌ టూ ముగించి రెండుసార్లు నీట్‌ రాశాడు. అయినా ఫలితం లేకపోవడంతో గత సెప్టెంబరులో జరిగిన నీట్‌కు కూడా హాజరయ్యాడు. 
 
అప్పటి నుంచి ముభావంగా ఉంటున్న కీర్తివాసన్‌.. మరికొద్ది రోజుల్లో పరీక్ష ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగాడు. ఆతర్వాత తల్లికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. 
 
తల్లి ఇంటికి చేరుకుని చూసేసరికి నోటి నుంచి నురగలు కక్కుతూ కీర్తివాసన్‌ కనిపించాడు. దీంతో అతడిని తొలుత పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి కోయంబత్తూరు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.