ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (18:20 IST)

8 గంటల పాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగిన నవ వధువు ప్రాణం పోయింది..

కరోనా వైరస్ బారినపడిన ఓ నవ వధువు పడక కోసం 8 గంటలపాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి చివరికి కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన ఒడిశా రాష్ట్ర రాజధాని భవనేశ్వర్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్వర్ణలతా పాల్ అనే 25 ఏళ్ల యువతి గత నెల 28న ఖుర్దా జిల్లాకు చెందిన బిష్ణు చరణ్ బోల్‌ను పెళ్లాడింది. గతవారం మొదట్లో జర్వం వచ్చింది. ఆ తర్వాత ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది. 
 
శనివారం ఉదయం స్వర్ణలతకు శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆమెలో ఆక్సిజన్ స్థాయులు 54 శాతానికి పడిపోయాయి. దీంతో ఆమెను బాలిపట్నలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 
 
అక్కడామెను పరీక్షించిన వైద్యులు భువనేశ్వర్‌లోని కేపిటిల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడి తీసుకెళ్తే కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అయితే ఆమె ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణిస్తుండడంతో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్‌కు కాకుండా భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. 
 
తీరా అక్కడికి వెళ్లాక కొవిడ్ టెస్ట్ రిపోర్టు ఉంటేనే తీసుకుంటామని మెలికపెట్టారు. దీంతో వారు మరో గత్యంతరం లేక నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు కూడా కొవిడ్ టెస్టు రిపోర్టు ఉంటనే చేర్చుకుంటామని తెగేసి చెప్పారు. 
 
దీంతో చేసేది లేక అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా అలాంటి సమాధానమే వచ్చింది. చివరకు తిరిగి తిరిగి మళ్లీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కే తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు స్వర్ణలతకు ఓ ఇంజక్షన్ ఇచ్చి మళ్లీ భువనేశ్వర్‌లోని కేపిటల్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.  
 
అక్కడికి వెళ్లినా చేర్చుకోలేదని, తిరిగి తిరిగి వస్తున్నామని ఇక్కడే వైద్యం చేయాలని బాధిత యువతి కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని గద్దించారు. 
 
చేసేది లేక ఊసురోమంటూ శనివారం మధ్యాహ్నం తిరిగి కేపిటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె దాదాపు శ్వాస తీసుకోవడం మానేసింది. అక్కడామెకు కొవిడ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా తేల్చారు. ఆ తర్వాత గంటకే ఆ నవ వధువు కన్నుమూసింది. 
 
మరోవైపు, 8 గంటలపాటు వారిని ఆసుపత్రుల చుట్టూ తిప్పిన అంబులెన్స్ డ్రైవర్ బాధిత కుటుంబ సభ్యుల నుంచి రూ.25 వేలు వసూలు చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.