కరోనా కాటుకు ప్రాణాలు విడిచిన కాంగ్రెస్ ఎంపీ - ప్రధాని సంతాపం
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) ఆదివారం కన్నుమూశారు. కరోనా, సైటోమెగలో వైరస్‌పై 23 రోజుల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన.. పుణెలోని ఆసుపత్రిలో మృతి చెందారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఏప్రిల్ 19న రాజీవ్ సతావ్ కరోనా లక్షణాలను కనిపించాయి. పరీక్షలు చేయడంతో 21న పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన పుణెలోని జహంగీర్ హాస్పిటల్‌లో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వారం తర్వాత వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించగా కొంత వరకు కోలుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూకు తరలించారు. ఈ క్రమంలో ఆదివారం పరిస్థితి చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతిపై కాంగ్రెస్ పార్టీ, నేతలు సంతాపం ప్రకటించారు.
రాజీవ్ సతావ్ మృతిపై కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నేను యూత్ కాంగ్రెస్‌లో నాతో ప్రజా జీవితంలో మొదటి అడుగు వేసిన స్నేహితుడిని కోల్పోయాను అని ట్వీట్ చేశారు.
అలాగే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. రాజీవ్ సతావ్ రాజకీయాల్లో బాగా ఎదుగుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
నా పార్లమెంట్ మిత్రుడు రాజీవ్ సతావ్ మరణం నన్ను కలచివేసింది. రాజీవ్ సతావ్ సమర్థమైన పనితీరుతో ఎదుగుతున్న నాయకుడు. రాజీవ్ సతావ్ కుటుంబానికి, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.