కాంగ్రెస్ ఎంపీ - వసంత్ అండ్ కో ఫౌండర్ హెచ్. వసంత్ కుమార్ మృతి
తమిళనాడులో ప్రముఖ అప్లయన్సెస్ స్టోరుగా గుర్తింపు పొందిన వసంత్ అండ్ కో వ్యవస్థాపకుడు హెచ్. వసంత్ కుమార్ మృతి చెందారు. ఆయన వయసు 70 యేళ్లు. ఈయన ప్రస్తుతం కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గత కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఆయనకు కరోనా పరీక్ష చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్, ఎక్మో సపోర్టుతో చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో సాయంత్రానికి తుదిశ్వాస విడిచారు.
కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, మంచి రాజకీయనేతగా కూడా గుర్తింపు పొందారు. ఈయన రెండుసార్లు నాంగునేరి అసెంబ్లీ స్థానం 2006, 2016లో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కన్యాకుమారి స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈయన అపుడు కేంద్ర మంత్రిగా ఉన్న పొన్ రాధాకృష్ణన్‌ను భారీ మెజార్టీతో ఓడించి రికార్డు సృష్టించారు.
అంతేకాకుండా, ఎంపీగా తనకు వచ్చే నిధులను స్థానిక యువతకు ఉపాధితో పాటు.. అభివృద్ధికి ఖర్చు చేసి ఇతర ఎంపీలకు ఆదర్శనంగా నిలిచారు. ఈయనకు తమిళనాడు వ్యాప్తంగా వసంత్ అండ్ కో పేరుతో అనేక స్టోర్లు ఉన్నాయి. అలాగే, వసంత్ అనే టీవీ చానెల్ కూడా ఉంది. పక్కా కాంగ్రెస్, గాంధేయవాది.