మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:15 IST)

వచ్చే వారం రోజులు అత్యంత కీలకం: ఉపరాష్ట్రపతి

వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 
 
మార్చి 24న ప్రధాని మోదీ మూడువారాల లాక్‌డౌన్‌ ప్రకటించాక మొదటి రెండు వారాలు ప్రజలంతా బలమైన సంకల్పంతో కరోనాపై పోరాటం చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మూడో వారంలోకి చేరుకున్న క్రమంలో ఏప్రిల్‌ 14 తర్వాత ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటి మాదిరిగానే దేశప్రజలంతా ప్రభుత్వానికి సహరించి కరోనాను పూర్తిగా అంతం చేయాలని పిలుపునిచ్చారు.

బలమైన నాయకత్వం వల్లే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా సురక్షితంగా బయటపడతారన్నారు. ఆర్థికంగా దేశానికి నష్టం వాటిల్లినప్పటికీ తిరిగి గాడిలో పెట్టవచ్చని, అదే మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావని ఈ సందర్భంగా ఆయన  వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు కారణంగా కరోనావైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామన్నారు.

భౌతికదూరం పాటించకపోతే ఎంతటి విపత్తు ఏర్పడుతుందో తబ్లీగీజమాత్‌ కార్యక్రమం ద్వారా తేటతెల్లమైందని, ప్రజలంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కచ్ఛితంగా భారతదేశం కరోనాపై విజయం సాధించితీరుతుందని  ధీమా వ్యక్తం చేశారు.
 
ఈ కష్టకాలంలో ఆకలి బాధలు లేకుండా పంటలు పండించే రైతులకు మనమంతా రుణపడి ఉండాలన్నారు. ప్రజలంతా కలకాలం హాయిగా జీవించాలంటే ఇంకొన్ని రోజులు ఇబ్బందులను భరించాలని ప్రజలకు విన్నవించారు.