1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:59 IST)

కఠిన ఆంక్షల దిశగా యూపీ సర్కారు - 25 నుంచి రాత్రి కర్ఫ్యూ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇది రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. 
 
అలాగే, వివాహాది శుభకార్యాలకు కూడా ఆంక్షలు విధించింది. కేవలం 200 మందికి మించి పాల్గొనకుండా నిబంధన విధించింది. పైగా, ఇలాంటి కార్యక్రమాలకు హాజరైన వారంతా విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచన చేసింది. 
 
దేశంలో ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రం రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తుంది. ఇపుడు యూపీ సర్కారు కూడా ఈ తరహా ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమైంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు యూపీలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఢిల్లీ ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెల్సిందే.