ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (19:34 IST)

దగ్గరకు వచ్చి దగ్గుతున్నాడనీ వ్యక్తిని కాల్చిన స్నేహితుడు

గ్రేటర్ నోయిడాలో దారణం జరిగింది. అసలే కరోనా వైరస్ భయంతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సామాజిక భౌతిక దూరం పాటింటాలంటూ వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. అలాగే, మనకు సమీపంలో ఎవరైనా దగ్గినా భయంతో వణికిపోయే పరిస్థితులు దేశ వ్యాప్తంగా నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఉద్దేశ్యపూర్వకంగా దగ్గరకు వచ్చి దగ్గడాన్ని జీర్ణించుకోలేని స్నేహితుడు.. ఆగ్రహంతో ఆ వ్యక్తిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణం గ్రేటర్ నోయిడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రేటర్ నోయిడా, దయా నగర్‌కు చెందిన ప్రశాంత్‌సింగ్ అలియాస్ ప్రవేశ్ (25), జై వీర్‌సింగ్ అలియాస్ గుల్లూ (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ప్రశాంత్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి దయానగర్ ఆలయంలో లూడో ఆడుతున్నాడు.
 
అదే సమయంలో అక్కడికి గుల్లూ వచ్చాడు. అతడిని చూసిన ప్రవేశ్ పదేపదే దగ్గడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. తనను చూసి కావాలనే దగ్గుతున్నాడని గుల్లూ గొడవ పెట్టుకున్నాడు. అది మరింత ముదరడంతో సహనం కోల్పోయిన గుల్లూ జేబులోంచి తుపాకి తీసి ప్రవేశ్‌పై కాల్పులు జరిపాడు. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రవేశ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుల్లూకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు.