మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (12:59 IST)

డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టిన నర్సు.. పని ఒత్తిడిని తట్టుకోలేకనే..?

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీయడమే కాదు, కరోనా బారినపడి వారి ప్రాణాలు రక్షించడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది భావోద్వేగాలతో కూడా ఆటాడుకుంటుంది. 
 
ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో వారికి బెడ్లు సమకూర్చడం నుంచి చికిత్స అందించడం వరకు ప్రతిదీ తలకు మించిన భారంగా మారిపోతున్నది. దాంతో వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
 
ఈ క్రమంలోనే పలు ఆస్పత్రుల్లో డాక్టర్లకు, డాక్టర్లకు మధ్య.. డాక్టర్లకు నర్సులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒత్తిడిలో సహనం కోల్పోయి ఒకరిపై మరొకరు దూషణలకు దిగుతున్నారు. కింది స్థాయి సిబ్బందిపై చిందులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్‌కు, నర్సుకు మధ్య గొడవ జరిగింది. 
 
ఒకరిని ఒకరు బండబూతులు తిట్టుకున్నారు. చివరికి సహనం నశించిన నర్సు డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టింది. దాంతో డాక్టర్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కాగా, ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్‌జీ మిశ్రా కూడా ఘటనపై ఇద్దరిని వేర్వేరుగా విచారించారు. 
 
తాను కొట్లాడుతున్న డాక్టర్‌, నర్సు ఇద్దరితో విడివిడిగా మాట్లాడానని, ఇద్దరూ కూడా పని ఒత్తిడిని తట్టుకోలేకనే తాము సహనం కోల్పోయామని చెప్పారని తెలిపారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.