1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:24 IST)

కోవిడ్-19: హాస్పిటల్లో చోటు లేదు, ఇంట్లో ఉంటే మందుల్లేవు, దిల్లీలో కరోనా బాధితుల వేదన

భర్తను బ్రతికించుకునేందుకు నోట్లోకి ప్రాణవాయువు...
దేశ రాజధాని దిల్లీతోపాటు దేశంలోని పలు నగరాలలోని ఆసుపత్రులతో బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. కోవిడ్ బారిన పడిన వారిని ఇంటి దగ్గరే ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. ఇంతకన్నా మార్గం కూడా లేదు. దిల్లీ ఆసుపత్రులతో ఆక్సిజన్‌ కొరత కొనసాగుతోంది. వైరస్ బాధితులకు ఇవ్వాల్సిన కీలకమైన ఔషధాలు మార్కెట్‌లో దొరకడం లేదు. ఈ మందులన్నీ ఏమవుతున్నాయి? బ్లాక్ మార్కెట్‌లో డబుల్ రేటుకు అమ్ముడవుతున్నాయి. సోమవారం నాడు దేశం వ్యాప్తంగా 3,52,991 కొత్త కేసులు నమోదయ్యాయి.

 
ఆక్సిజన్ ఎక్కడ?
అంశు ప్రియా ఆదివారమంతా ఆక్సిజన్ సిలిండర్ కోసం ప్రయత్నం చేశారు. ఆమె బావ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ఆయనకు అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సి ఉంది. దిల్లీ, నోయిడాలలో ఏ ఆసుపత్రిలో ప్రయత్నించినా బెడ్ దొరకలేదు. ఇప్పుడు ఆక్సిజన్ కొరత కూడా వేధిస్తోంది. దీంతో ఆమె బ్లాక్‌ మార్కెట్‌లో ఎక్కడైనా ఆక్సిజన్ సిలిండర్ దొరుకుతుందేమోనని ప్రయత్నించారు. రూ. 6000కు దొరికే సిలిండర్‌ను ఆమె రూ.50,000 కొన్నారు. ఇప్పుడు అంశు ప్రియ అత్తగారు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రెండో సిలిండర్ కొనడం ఆమెకు కష్టంగా మారింది.

 
బ్లాక్‌లో మెడిసిన్, ఆక్సిజన్
దిల్లీ నగరంలో పలు ప్రాంతాలలో ఆక్సిజన్ సిలిండర్లు అమ్మే పలువురిని బీబీసీ ఫోన్ ద్వారా సంప్రదించింది. వారు వాస్తవ ధరకు పదిరెట్లు ఎక్కువ రేటు చెప్పారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నవారిలో అంశు ప్రియ ఒకరు మాత్రమే. దిల్లీ, నోయిడా, లఖ్‌నవూ, అలహాబాద్, ఇండోర్... ఇలా అనేక నగరాలు, పట్టణాలలో ఆసుపత్రుల్లో బెడ్లు లేక ఇళ్ల నుంచే చికిత్స తీసుకుంటున్నారు. వారిలో చాలామందికి మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉండటం లేదు.

 
ఏ ఆసుపత్రిలోనూ ఐసీయూ బెడ్‌లు ఖాళీగా లేవు. దిల్లీలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఆర్ధికంగా బలంగా ఉన్నవారు, వైద్యులను సంప్రదించిన తర్వాత ఇంటికి నర్సులను పిలిపించుకుని చికిత్స చేయించుకోగలుగుతున్నారు. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతి రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇది ప్రపంచ రికార్డు. ఆసుపత్రులలో వనరులు తక్కువ కాగా, వైరస్ బాధితుల సంఖ్య సాధారణంగా వచ్చే రోగులకన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో టెస్టులు, సీటీ స్కాన్లు, ఎక్స్‌రేలకు ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

టెస్టు రిపోర్టులు రావడానికి బాధితులు మూడు, నాలుగు రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వైద్యులు సీటీ స్కానింగ్‌కు సిఫార్సు చేస్తున్నారు. కానీ, సీటీ స్కాన్‌కు కూడా అపాయింట్‌మెంట్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితులు రోగుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రులలో బెడ్లు దొరికినా, టెస్ట్‌ రిపోర్ట్ రాకపోవడంతో వారికి ఆసుపత్రిలో ప్రవేశం లభించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెడ్ దొరకక పోవడంతో అనుజ్ తివారీ తన సోదరుడికి చికిత్స కోసం ఒక నర్సును నియమించుకున్నారు. ఆక్సిజన్ దొరకక దిల్లీ నగరంలో ఇప్పటికే చాలామంది రోగులు మరణించారు.

 
పొంచి ఉన్న పెను ప్రమాదం
గత కొన్ని రోజులుగా దిల్లీలో చాలా ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత గురించి హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆక్సిజన్ కొన్ని గంటలు మాత్రమే వస్తుందంటూ వైద్యులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఎక్కడికక్కడ ఆక్సిజన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో ఎలాగో గంటలు గడుస్తున్నాయి. కానీ, దిల్లీలో ఆసుపత్రులు పని చేస్తున్న తీరు.. ఏదో ఒక రోజు పెను ప్రమాదానికి దారి తీయవచ్చని ఓ వైద్యుడు అన్నారు.

 
అనుజ్ తివారీ తన సోదరుడి కోసం చాలా డబ్బులు వెచ్చించి ఆక్సిజన్ కొన్నారు. యాంటీ వైరల్ డ్రగ్ 'రెమ్‌డెసివిర్‌' కొనుక్కు రావాల్సిందిగా డాక్టర్లు అనుజ్‌ను కోరారు. కానీ, ఎన్ని స్టోర్లు తిరిగినా 'రెమ్‌డెసివిర్‌' దొరక లేదు. మీ సోదరుడిని ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉందని అనుజ్‌కు చికిత్స చేస్తున్న వైద్యుడు చెప్పారు. ''పరిస్థితి చేయిదాటక ముందే ఆసుపత్రిలో చేర్చాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఎక్కడా బెడ్లు దొరకలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి'' అని వాపోయారు అనుజ్.

 
ఇప్పటికే ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఈ మందులను కొని తమ వద్ద పెట్టుకుంటున్నారు. దీంతో చాలామందికి మందులు దొరక్క పరిస్థితి విషమించి ఆసుపత్రులకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. 'రెమ్‌డెసివిర్‌' అమ్మే పలువురు డ్రగ్ డీలర్లతో బీబీసీ మాట్లాడింది. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా ఉందని, అందువల్ల కొందరు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని వారు చెబుతున్నారు.

దేశంలో ఏడు ఫార్మా కంపెనీలకు 'రెమ్‌డెసివిర్‌' మందును తయారు చేసేందుకు అనుమతి ఉంది. వాటి ఉత్పత్తిని పెంచాల్సిందిగా ప్రభుత్వం ఆయా సంస్థలను కోరింది. కానీ వారు ప్రభుత్వానికి చేసిన వాగ్దానాలు విఫలమైనట్లు వాస్తవాలను గమనిస్తే అర్ధమవుతుంది. 'రెమ్‌డెసివిర్‌' ఔషధ ఉత్పత్తిని పెంచాలన్న ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వం చాలా ఆలస్యం చేసిందని ఎపిడెమాలజిస్టు డాక్టర్ లలిత్ కాంత్ అన్నారు.

 
''ఈ డ్రగ్ బ్లాక్ మార్కెట్లో దొరుకుతోంది. అంటే సప్లయ్ చైన్‌లో ఎక్కడో లోపం ఉంది. కరోనా మొదటి వేవ్ నుంచి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదు'' అన్నారు డాక్టర్ లలిత్ కాంత్. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న మందుల్లో 'టోసిలిజుమాబ్' ఒకటి. సాధారణ పరిస్థితుల్లో ఆర్థరైటిస్ జబ్బుకు ఈ డ్రగ్‌ను వాడతారు. కోవిడ్ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారు వెంటిలేటర్ వరకు వెళ్లే పరిస్థితిని ఈ డ్రగ్ నివారించగలదని కొన్ని అధ్యయనాలు తేల్చాయి.

 
అయితే ఈ డ్రగ్ ఇప్పుడు మార్కెట్‌లో దొరకడం లేదు. అవసరమైన స్థాయిలో డ్రగ్‌ను అందించడంలో తయారీ సంస్థ విఫలమైంది. మామూలు పరిస్థితుల్లో ఈ మందు 400 ఎంజీ ధర రూ.3200 కాగా, బ్లాక్ మార్కెట్లో అది రూ.25000 వరకు అమ్ముతున్నారు. ''ఇంత ధర పెట్టి సామాన్యులు ఈ మందును కొనగలరా ? ప్రభుత్వం దీన్ని స్టాక్ పెట్టుకుని ఉండాల్సింది. అసలు సర్కారు దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు'' అని ప్రజారోగ్య నిపుణుడు అనంత్ భాన్ అన్నారు.

 
మార్కెట్‌లోకి నకిలీ మందులు
నకిలీ 'రెమ్‌డెసివిర్‌' మార్కెట్‌లో దొరుకుతోంది. ఒక డీలర్‌తో బీబీసీ మాట్లాడినప్పుడు, ఆయన చెప్పిన ఔషధ కంపెనీ భారత ప్రభుత్వం అనుమతించిన ఫార్మా సంస్థల జాబితాలో లేదు. అయితే, తమకు అనుమతులు ఉన్నాయని సదరు డీలర్ చెప్పారు. కానీ, ఆ మెడిసిన్ ప్యాకేజింగ్‌పై స్పెల్లింగ్ దగ్గర్నుంచి అనేక లోపాలున్నాయి. సాధారణంగా అన్ని అనుమతులు ఉన్న కంపెనీల దగ్గర ఇలాంటివి జరగవు. ఈ కంపెనీ పేరును ఇంటర్నెట్‌లో వెతకగా, దానికి సంబంధించిన సమాచారం కూడా లభించలేదు.

నకిలీ మందుల గురించి ప్రజలకు అనుమానాలు ఉన్నా, వాటిని కొనక తప్పని స్థితి నెలకొంది. మరికొందరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ద్వారా సరఫరా చేస్తామంటూ మోసాలు చేస్తున్నారు. ఆక్సిజన్‌ నుంచి మెడిసిన్స్ వరకు అన్నీ ఇంటికి సరఫరా చేస్తామంటూ అనేక పేర్లు, ఫోన్ నంబర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ వాటిలో ఏవీ పని చేయడం లేదు. కొందరు మోసాలు చేస్తున్నారు. ఐటీ కంపెనీలో పని చేస్తున్న ఓ వ్యక్తి ఇలాగే మోసపోయారు. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఆయన, ఆక్సిజన్ సిలిండర్, 'రెమ్‌డెసివిర్‌' కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసినట్లు చెప్పారు.

 
ఆయన ఆ వ్యక్తిని సంప్రదించినప్పుడు, రూ .10,000 ముందుగానే జమ చేయాలని కోరాడు. '' తీరా డబ్బులు జమ చేశాక అతను ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు'' అని ఆయన వివరించారు. మోసాలు పెరుగుతుండటంతో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉంది. 'రెమ్‌డెసివిర్‌' బ్లాక్‌ మార్కెట్‌ను నిరోధిస్తామని చాలా రాష్ట్రాలు వాగ్దానం చేశాయి. కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నాయి. కానీ, ఇంత జరుగుతున్నా, బ్లాక్ మార్కెట్ కొనసాగుతూనే ఉంది.

 
''ఎంత ఖరీదైనా కొనడం తప్ప మరో మార్గం లేదు'' అన్నారు అనుజ్ తివారీ. ''ఆసుపత్రిలో చికిత్స పొందడం చాలా కష్టం. కనీసం ఇంట్లో పెట్టుకుని రక్షించుకునే పరిస్థితి లేదు'' అన్నారాయన.