శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (12:32 IST)

కరోనా ఎఫెక్ట్, అమాంతం పెరిగిపోయిన నిమ్మ, బత్తాయి ధరలు

కరోనావైరస్ కారణంగా సి విటమిన్ అధికంగా వున్న పండ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో వీటి ధరలు 20-30% పెరుగుదల కనిపిస్తోంది. చార్‌మినార్‌లోని పండ్ల అమ్మకందారుడు ఒకరు మాట్లాడుతూ, మార్కెట్లో పండ్ల సరఫరా తక్కువగా ఉందని, డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు.
 
ద్రాక్ష ధర 20% పెరిగిందని చెప్పారు. కిలో ఒక్కింటికి రూ. 80 అయితే ఇప్పుడది 120 రూపాయలైంది. పైనాపిల్ ధర రూ. 40 నుంచి 60కి పుచ్చకాయ రూ. 60 నుంచి 100 రూపాయలకు చేరుకున్నాయి. ప్రజలు వివిధ కారణాల వల్ల పండ్లు అధికంగా తింటున్నారని, అందువల్ల ఈ వేసవి కాలంలో పండ్ల డిమాండ్ పెరిగిందని చెప్పారు.
 
మరోవైపు దేశంలో చూస్తే గుజరాత్‌లోని వడోదర, సూరత్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాలు ఇలాంటి పండ్ల ధరలు చుక్కలు చూస్తున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో నిమ్మకాయ కిలోకు 150 నుంచి 250 రూపాయలకు అమ్ముడవుతోంది. ఇది గత ఏడాది 60 రూపాయలు. గత సంవత్సరం, నిమ్మకాయ 20 కిలోలకు 700 రూపాయలు, ఇది ఇప్పుడు 1400కి చేరుకుంది.
 
ఇండోర్‌లో నారింజ ధర కిలోకు రూ.200కు చేరుకుంది. ఈ సీజన్‌లో నిమ్మకాయలు మార్కెట్లోకి రావడం కూడా తగ్గుతోందని, డిమాండ్ ఎక్కువగా ఉందని సూరత్‌కు చెందిన జయేశ్ భాయ్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మకాయను నగరంలో కిలోకు 250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. 
 
మునుపటి రోజులతో పోలిస్తే, నిమ్మకాయలు మాత్రమే కాకుండా, నారింజ ధరలు కూడా పెరిగాయని వడోదరలోని ఒక కర్మాగారంలో పనిచేసే కెమికల్ ఇంజనీర్ సంజయ్ సేథియా అన్నారు. తాము ఇటీవల 8 కిలోల నారింజను 1000 రూపాయలకు కొనుగోలు చేశామని చెప్పారు.
 
డిమాండ్ ఎందుకు పెరిగింది
కరోనా కాలంలో, రోగుల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ వారి రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అనేక బ్యాక్టీరియా, వైరల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా వుంటే ఒక వ్యక్తి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది. ఈ కారణంగా, నిమ్మ, నారింజ డిమాండ్ బాగా పెరిగింది.