సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జనవరి 2025 (16:51 IST)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

NamoBharat
ఢిల్లీ - ఘజియాబాద్ ప్రాంతాల మధ్య పూర్తి చేసిన నమో కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్‌ఆర్‌టీఎస్‌ కారిడార్‌లో 13 కిలోమీటర్ల అదనపు సెక్షన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు. ఈ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13 కి.మీ విభాగంలో 6 కిలోమీటర్ల మేరకు భూగర్భంలో నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నమో భారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారని తెలిపారు.
 
ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు ఆప్‌ ప్రభుత్వంతో విసిగిపోయారని అన్నారు. ప్రస్తుతం వారు దేశ రాజధానిని అభివృద్ధి బాటలో నడిపే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. నేడు ప్రారంభించిన నమో భారత్‌ కారిడార్‌ ఢిల్లీకి మేరఠ్‌కు మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని అన్నారు. 
 
ఢిల్లీ శాఖ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.12,200 కోట్లు కేటాయించిందన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రిథాలా - కుండ్లి మెట్రో పొడిగింపు, జనక్‌పురి - కృష్ణా పార్క్ మెట్రో లైన్, ర్యాపిడ్ రైల్ కారిడార్ వంటి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ ఆయన ప్రశంసించారు. ఢిల్లీని ఎవరైనా అభివృద్ధి చేస్తే అది ప్రధాని మోడీ మాత్రమే అని అన్నారు.