సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

యూపీఏ పాలనలో తెలుగు రాష్ట్రాల విభజన అడ్డగోలుగా జరిగింది : ప్రధాని మోడీ

modi - parliament
గత యూపీఏ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు సరిగా జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వినాయకచవితి రోజైన సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, పాత పార్లమెంట్ భవన 75ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ఆయన స్పందించారు. 
 
ఈ పార్లమెంట్ భవనంలోనే దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ భవనంలోనే జరిగింది. కానీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల తరహాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగలేదన్నారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు ప్రణాళికాబద్ధంగా జరిగిందన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. కానీ, తెలంగాణ ఏర్పాటు సమయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘర్షణలు, నిరసనలు భారీ స్థాయిలో జరిగాయి. ఈ విభజన ఇరు వర్గాల నేతలను పరామర్శించలేక పోయింది. తెలంగాణ రాష్ట్రంలో రక్తపుటేరులు పారాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ రాష్ట్రంలో సంబరాలు చేసుకోలేక పోయారు. 
 
మంగళవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ.. పాత భవనంతో జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల ఏర్పాటుకు ఈ భవనం వేదికైందని తెలిపారు. అయితే, యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగా జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో ఏపీ, తెలంగాణ ఇరు వర్గాలూ అసంతృప్తికి గురయ్యాయని అన్నారు. 
 
'ఈ చారిత్రక భవనం నుంచి మనం వీడ్కోలు తీసుకుంటున్నాం. స్వాతంత్ర్యానికి ముందు ఈ భవనం ఇంపీరియల్‌ లెజిస్లేచర్‌ కౌన్సిల్‌గా ఉండేది. ఈ భవనం చారిత్రక ఘట్టాలకు వేదికైంది. మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుంది. భారత్‌ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి. ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయి' అని మోడీ పేర్కొన్నారు.