కర్నాటక ముఖ్యమంత్రిని నేనే రావొద్దని చెప్పాను : ప్రధాని నరేంద్ర మోడీ
తన విదేశీ పర్యటనను ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు శనివారం ఉదయం బెంగుళూరు నగరానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేదా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లలో ఏ ఒక్కరూ హాజరుకాలేదు. మోడీ ఉద్దేశపూర్వకంగానే వారిని విమానాశ్రయానికి రావొద్దన్నారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వీటికి ప్రధాని మోడీ స్వయంగా స్పష్టతనిచ్చారు.
బెంగుళూరులోని హాల్ ఎయిర్ ఎయిర్‌పోర్టు వెలుపల ప్రధాని మాట్లాడుతూ, "బెంగుళూరుకు నేను ఏ సమయంలో చేరుకుంటానో ఖచ్చితంగా తెలీదు. ప్రొటోకాల్ విషయంలో గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. అందుకే వారిని రావొద్దని చెప్పాను" అని వివరణ ఇచ్చారు. కాగా, గ్రీస్ దేశం నుంచి శుక్రవారం బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ మోడీ విమానం శనివారం ఉదయం నేరుగా బెంగుళూరు నగరానికి చేరుకుంది. చంద్రయాన్-3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందించారు.
అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ మాట్లాడుతూ, "తనకంటే ముందు కర్నాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడంపై మోడీ చాలా చిరాకుగా ఉన్నారు. అందుకే ప్రొటోకాల్‌కు విరుద్ధంగా వారిద్దరిని ఉద్దేశపూర్వకంగా ఎయిర్‌పోర్టుకు రాకుండా ఆపేశారు. ఇలాంటి రాజకీయాలు హాస్యాస్పదం. చంద్రయాన్ విజయం వేళ, 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ముందు సీఎంగా ఉన్న మోడీ, అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని మోడీ మర్చిపోయారా?" అని జైరాం రమేష్ ప్రశ్నించారు.
మరోవైపు ఈ వివాదంపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినదాంతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారం తాను, సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లి ప్రధానిని ఆహ్వానించాలని అనుకున్నాం. కానీ, ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన సమాచారాన్ని మేం గౌరవించాలనుకున్నాం. పొలిటికల్ గేమ్ ఇప్పటికే ముగిసింది. ఇపుడు అభివృద్ధిపై దృష్టిసారించాం" అని అన్నారు.