శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

అదానీ - అంబాలీలకు మేలు చేసే చట్టాలను రద్దు చేయాలి.. మోడీ తల్లికి రైతు వినతి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ మోడీకి ఓ రైతు కన్నీటి లేఖ రాశారు. అదానీ - అంబానీలకు మేలు చేసే మూడు కొత్త వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేసేలా ప్రధానిపై ఓ తల్లిగా ఒత్తిడి తీసుకునిరావాలని కోరారు. 
 
కేంద్రం మూడు కొత్త వ్యవసాయ సాగు చట్టాలను తీసుకొచ్చింది. ఈ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దులో రైతులు ప‌ట్టువిడ‌వ‌కుండా పెద్ద ఎత్తున ఆందోళ‌నలు చేస్తున్నారు. అయితే, దీనిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కపోవడంతో ఆయ‌న తల్లికి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హ‌ర్‌ప్రీత్ సింగ్ అనే రైతు తాజాగా ఓ లేఖ రాశాడు.
 
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేసేలా కుమారుడి మ‌న‌సును మార్చాలంటూ నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ మోడీకి విజ్ఞప్తి చేశాడు. మోడీ త‌ల్లిగా త‌న‌కున్న అధికారాల‌న్నింటినీ ఆమె వినియోగించుకోవాల‌ని ఆమె త‌న కుమారుడి మ‌న‌సును మార్చుతార‌ని ఆశిస్తున్నాన‌ని ఆ రైతు లేఖలో పేర్కొన్నాడు.
 
ఈ చ‌ట్టాల‌ను ఎందుకు ర‌ద్దు చేయాలో కూడా ఆ రైతు పూర్తిగా వివరించారు. కేంద్ర ప్ర‌భుత్వం ఈ వ్యవ‌సాయ చ‌ట్టాల‌ను అదానీ, అంబానీతో పాటు బ‌డా కార్పొరేట్ల‌కు మేలు చేసేలా రూపొందించారని చెప్పాడు. త‌ల్లి మాట‌ను ఎవ‌రూ కాద‌న‌రని, అందుకే మోడీ త‌ల్లిగా హీరాబెన్ ఆయ‌న‌కు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని సూచ‌న చేయాల‌ని ఆ రైతు రాసిన లేఖలో పేర్కొన్నారు.