బడ్జెట్‌లో పన్నుల బాదుడు : పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు?!

ఠాగూర్| Last Updated: మంగళవారం, 19 జనవరి 2021 (10:39 IST)
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సుంకాలను భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా, 21 వేల కోట్ల రూపాయలను సుంకాల రూపంలో రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులోభాగంగా వచ్చే బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్ ధరలను విపరీతంగా పెంచాలన్న యోచనలో ఉంది.

ముఖ్యంగా, ఈ బడ్జెట్‌లో 50కి పైగా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 5 శాతం నుంచి 10 శాతం మేర పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ విడిభాగాలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు ఇతర అప్లియెన్సెస్‌ దిగుమతులపై ఈ భారం పడే వీలుందని సోమవారం న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌తో ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు సమాచారం.

ఈ ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం 2021-22కుగాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. గతేడాది కూడా పాదరక్షలు, ఫర్నీచర్‌, బొమ్మలు, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ తదితర ఉత్పత్తులపై 20 శాతం వరకు దిగుమతి సుంకాలను పెంచారు.

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన మందగమనం వల్ల ప్రభుత్వ ఆదాయం ఒక్కసారిగా పడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు సర్కారీ ఖర్చులూ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో సుంకాల మోత గట్టిగానే వినపడే వీలుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో దిగుమతి సుంకాల పెంపుతో ఖజానాకు దాదాపు రూ.20 వేల కోట్ల నుంచి 21 వేల కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాల్లో ఒకరు చెప్పారు.దీనిపై మరింత చదవండి :