బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (16:11 IST)

రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి.. అపుడే వారికి మోక్షం లభిస్తుంది...

pappu yadav
దేశంలోని రాజకీయ నేతలు, ధనవంతులంతా ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో చనిపోవాలని, అపుడే వారికి మోక్షం లభిస్తుందని బీహార్ రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజ్ (పప్పు యాదవ్) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో ఈ మహాకుంభమేళా వేడుకలు అత్యంత ఆధ్యాత్మికతతో జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ కుంభమేళాలో ఇటీవల తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు. దీనిపై పప్పూ యాదవ్ స్పందిస్తూ, కుంభమేళా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారు మోక్షం పొందినట్టు ఒక బాబా చెప్పారని, అందువల్ల బాబాలు, సంపన్నులు, రాజకీయ నేతలు త్రివేణి సంగమంలో చనిపోయి మోక్షం పొందాలని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై లోక్‌సభలో మాట్లాడుతూ, కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట తర్వాత 300 నుంచి 600 మంది వరకు ప్రాణాలు కోల్పోయివుంటారని, వారి మృతదేహాలను అక్కడి నుంచి తొలగించారని పేర్కొన్నారు. మృతులకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పైగా, కుంభమేళాలో చనిపోయిన వారంతా మోక్షం పొందినట్టు ఒక బాబా చెప్పారని, అందువల్ల మన దేశంలోని రాజకీయ నేతలు, ధనవంతులు, బాబాలు కూడా త్రివేణి సంగమంలో మునిగి చనిపోయి మోక్షం పొందాలని పప్పు వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.