బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (14:24 IST)

Kerala woman: ఎంత ధైర్యం.. బావిలో పడిపోయిన భర్తను కాపాడిన భార్య.. మిరియాల తోటలో?

Kerala woman to rescue husband from well
Kerala woman to rescue husband from well
కేరళలో మిరియాల గింజలు కోస్తుండగా ఇంట్లోని బావిలో పడిపోయిన తన భర్తను 56 ఏళ్ల మహిళ ధైర్యంగా కాపాడింది. 64 ఏళ్ల రమేశన్ మిరియాల తీగల నుండి నల్ల మిరియాల గింజలను కోయడంలో బిజీగా ఉన్నాడు. కానీ నిచ్చెన జారిపోయింది. ఈ మిరియాల చెట్టు కాస్త బావికి దగ్గరగా ఉండటంతో, రమేశన్ దానిలో పడిపోయాడు. దీంతో పెద్దగా శబ్ధం చేశాడు. 
 
ఆ శబ్దం విని ఇంట్లో ఉన్న అతని భార్య పద్మ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్త 40 అడుగుల బావిలో పడిపోయాడని చూసి షాకయ్యింది. పద్మ ఒక్కసారిగా కేకలు వేస్తూ, నెమ్మదిగా, జాగ్రత్తగా తాడు ఉపయోగించి బావిలోకి దిగింది. దాదాపు ఐదు అడుగుల నీరు ఉన్న బావి అడుగు భాగానికి చేరుకున్న తర్వాత, ఆమె రమేశన్‌ను పెకెత్తి గట్టిగా పట్టుకుంది. ఇంతలో స్థానికులు సైతం గుమికూడారు. 
 
ఆపై 20 నిమిషాలలో, అగ్నిమాపక దళ రెస్క్యూ బృందం వచ్చింది. స్థానిక అగ్నిమాపక దళ అధికారి ప్రఫుల్, పద్మను పిలిచి, అంతా బాగానే ఉందా అని అడిగాడు.

"వారెవరూ దిగి రావాల్సిన అవసరం లేదని, బదులుగా వలను  పంపమని ఆమె మాకు చెప్పింది. కాబట్టి మేము వల దించాము. ఆమె మొదట రమేశన్‌ను వలలోకి చేర్చడానికి సహాయం చేసింది. అంతే అతన్ని పైకి లాగాం. తరువాత ఆమె పైకి వచ్చింది. తాడు సాయంతో 40 అడుగుల బావిలోకి దిగడం వల్ల ఆమె చేతులు పూర్తిగా గాయపడ్డాయి. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా వుంది. కానీ పద్మ చేసిన సాహసోపేతమైన చర్యను పూర్తిగా అభినందించాలి" అని ఆపరేషన్‌లో పాల్గొన్న అగ్నిమాపక దళ అధికారి ప్రఫుల్ అన్నారు. వారు దాదాపు 40 నిమిషాల్లో బావి నుంచి బయటపడ్డారని.. ఇద్దరూ దాదాపు 20 నిమిషాలు లోపల వేచి ఉండాల్సి వచ్చిందని ప్రఫుల్ తెలిపారు.