భార్య వేరొకరితో కన్న బిడ్డకూ భర్తే తండ్రి : సుప్రీంకోర్టు
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో రిలేషన్లో ఉండి ఓ బిడ్డకు జన్మనిచ్చినా, ఆ బిడ్డకు కూడా భర్తే తండ్రి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్య మరొకరితో కన్న పిల్లలకూ భర్తే చట్టబద్ధంగా తండ్రి అవుతాడని పేర్కొంది.
ఎవిడెన్స్ యాక్ట్‌లోని 112వ సెక్షన్ ఇలాగే ప్రెస్యూమ్ చేస్తుందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. భాగస్వాముల మధ్య నాన్ యాక్సెస్‌తోనే అక్రమ సంబంధాన్ని ఆరోపిస్తున్న వ్యక్తే నిరూపించాల్సి ఉంటుందని, నిరూపణ కోసం డీఎన్ఏ టెస్టులకు కోర్టులు అనుమతించొద్దని ఆదేశించింది. అక్రమ సంతానంపై కేరళ మాజీ దంపతుల కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మహాకుంభమేళా తొక్కిసలాట : సుప్రీంలో పిల్ దాఖలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మౌని అమావాస్య సందర్భంగా సంగం ఘాట్ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ వ్యాజ్యం నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
కాగా, జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. 45 రోజుల పాటు జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జనవరి 29 వరకు 27 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.