తప్పుడు అఫిడవిట్... ప్రాసిక్యూట్‌కు ఓకే.. ఫడ్నవిస్‌కు సుప్రీం షాక్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు మంగళవారం ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 125 మేరకు అనుమతి ఇచ్చింది.
గత 2014లో జరిగిన ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవిస్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, అందులో క్రిమినల్ కేసులను చేర్చలేదంటూ సతీష్ యుకీ అనే వ్యక్తి ఓ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
అలాగే, ఇదే కేసులో ఫడ్నవిస్‌కు కింది కోర్టు, ముంబై హైకోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. తప్పుడు అఫిడవిట్ అనేది చట్టప్రకారం అంగీకారయోగ్యం కాదని, ఆ ప్రకారం దిగువ కోర్టుల తీర్పును కొట్టివేస్తున్నామని బెంచ్ స్పష్టం చేసింది.
దీంతో తప్పుడు అఫిడవిట్ కేసులో ఫడ్నవిస్ తాజా విచారణను ఎదుర్కోవలసి ఉంటుంది. కాగా, ఈనెల 21వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం గమనార్హం.