సోషల్ మీడియా ఖాతాలకు కూడా ఆధార్‌ను లింక్ చేస్తారా?
ఇప్పటికే గ్యాస్ కనెక్షన్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డులకు ఆధార్‌తో లింక్ చేసేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించందుకు రంగం సిద్ధమైంది. సోషల్ మీడియా ఖాతాలతో ఆధార్ వివరాలను అనుసంధానించడానికి సంబంధించి చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను రూపొందించే పనిలో వున్నారో లేదా అనే దానిపై ఈ నెల 24లోపు తెలపాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.
జస్టిస్ దీపక్ మిశ్రా గుప్తా, అనిరుద్ధ బోస్ సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఫేస్‌బుక్ ఇంక్ వేసిన పిటిషన్‌ను విచారించింది. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు ఆధార్‌ను అనుసంధానించడంపై దాఖలై వివిధ హైకోర్టుల వద్ద పెండింగులో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ ఫేస్‌బుక్ ఇంక్ బదిలీ పిటిషన్ దాఖలు చేసింది.
మద్రాస్ హైకోర్టులో రెండు, బొంబాయి, మధ్యప్రదేశ్ హైకోర్టులలో ఒక్కొక్కటి పిటిషన్లు దాఖలు చేసినట్లు ఫేస్ బుక్ సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో ఆధార్‌ను అనుసంధానించడంపై విరుద్ధమైన నిర్ణయాలు భారతదేశమంతటా ఉపయోగించిన ప్లాట్‌ఫామ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఈ దశలో విచారణను కొనసాగించకపోతే కోలుకోలేని నష్టాన్ని చవిచూడవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది.