క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు
దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇక మనుగడలోలేని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. ఢిల్లీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 253 యాక్టివ్‌గా లేని రాజకీయ పార్టీలు ఉన్నట్లు గుర్తించారు.
కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు రాసిన లేఖలకు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2014-19 ఎన్నికల్లో పోటీచేయని రాజకీయపార్టీలను సయితం యాక్టివ్‌గా లేని పార్టీలుగా గుర్తించారు.
కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారు.
కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ ఆరోపించింది. ఇంకా చాలా రాజకీయ పార్టీలు విధి విధానాలను పాటించడంలేదని ఈసీ గుర్తించింది. అందుకే ఆయా పార్టీలను రద్దు చేసినట్లుగా ఈసీ ప్రకటించింది.