గాడ్సే ఉగ్రవాదే.. అతనిని దేశభక్తుడిగా చూసేవారూ ఉగ్రవాదులే: సిద్ధరామయ్య
జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన బీజేపీ నాయకురాలు, భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ముమ్మాటికీ ఉగ్రవాదేనని తెలిపారు. గాంధీని చంపిన వారిని దేశ ప్రజలంతా ఉగ్రవాదిగానే భావిస్తారని, వారిని దేశభక్తులుగా చూసే వారు కూడా ఉగ్రవాదులేనని చెప్పారు.
స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువే అంటూ ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వి మరో వివాదానికి తెరతీశారు. ఈ వ్యాఖ్యల పట్ల బీజేపీ అధిష్ఠానం కూడా సీరియస్ కావడంతో, ఆమె క్షమాపణలు చెప్పారు.
ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ.. ప్రజ్ఞాసింగ్‌పై సీరియస్ అయ్యారు. గాడ్సేను దేశభక్తుడుగా పోల్చిన సాధ్వీని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బాపూను అవమానించిన ప్రజ్ఞాను తానెప్పటికీ క్షమించనన్నారు. కానీ ఆమె మాత్రం భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తారన్నారు.