బుధవారం, 17 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (10:12 IST)

బీహార్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న పీకే

prashanth kishore
బీహార్ రాష్ట్రానికి చెందిన జాతీయ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇపుడు క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇందుకోసం ఆయన ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ యేడాది ఆఖరులో జరుగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు. ఇది ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. ఎన్నో రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోర్... ఇపుడు బీహార్ రాష్ట్రంపై కన్నేశారు. పైగా, ఆయన కీలక శక్తిగా అవతరిస్తున్నారా? అనే చర్చ తెరపైకి వచ్చింది. 
 
త్వరలో బీహార్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కింగ్ మేకర్‌గా అవతరించనున్నారని తాజా ఒపీనియన్ పోల్ ఒకటి స్పష్టం చేసింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో పీకే మద్దతు ఎవరికి దక్కితే వారే అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఆదివారం వెలువడిన సర్వే ఫలితాల ప్రకారం, ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 8.3 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరికి మీ మద్దతు అని ప్రశ్నించగా, సర్వేలో పాల్గొన్న వారిలో 13.70 శాతం మంది పీకే వైపు మొగ్గు చూపడం గమనార్హం.
 
ఇక, సీఎం రేసులో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 33.5 శాతం మద్దతుతో అందరికంటే ముందున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు 24 శాతం మంది మద్దతు పలికారు. కూటముల విషయానికొస్తే, అధికార ఎన్డీయేకు 36.2 శాతం మంది మద్దతు తెలుపగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమికి 35.8 శాతం మంది ఓటు వేస్తామని చెప్పారు. ఈ రెండు కూటముల మధ్య కేవలం స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. దీంతో ప్రశాంత్ కిషోర్ ఇపుడు కీలక శక్తిగా మారే అవకాశాలు ఉన్నాయి.