మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:04 IST)

కాంగ్రెస్ పార్టీలోకి ప్రశాంత్ కిషోర్.. ఆహ్వానించిన సోనియా

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తిరిగి రాజకీయాల్లోకి రానున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అదీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయన ఇటీవల ఢిల్లీలోని రాహుల్‌ గాంధీ నివాసంలో సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలతో సమావేశం కావడంతో ఈ ప్రచారానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 
 
ఈ సందర్భంగా ఆ ముగ్గురూ ప్రశాంత్‌ కిశోర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రశాంత్‌ కిశోర్‌ వస్తే పార్టీలో ఏ బాధ్యతలు అప్పజెప్తారన్న విషయంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. అందరూ అనుకొన్నట్టు ఇది పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు మాత్రమే పరిమితమైన సమావేశం కాదని, అంతకంటే పెద్ద లక్ష్యమే ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 
 
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రశాంత్‌ కిశోర్‌ పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు మరింత బలం ఇచ్చేలా… ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ హరీశ్‌ రావత్‌ వ్యాఖ్యలు చేశారు. కానీ మూడు నాలుగు రోజుల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఓ శుభవార్త వింటారని అన్నారు. ‘శుభవార్త అంటే ఒక పంజాబ్‌కే కాదు. కాంగ్రెస్‌ కార్యకర్తలందరికీ శుభవార్త’ అని చెప్పారు.