శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (21:17 IST)

పంజాబ్‌లో ఓ వ్యక్తి 23మందికి కరోనా అంటించాడు..

పంజాబ్‌లో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకడంతో మృతి చెందాడు. ఈ ఒక్కడు 23మందికి కరోనా వైరస్ వ్యాపింపజేశాడు. రాష్ట్రంలో నమోదైన 33 కేసుల్లో ఈయన ద్వారా సంక్రమించినవి 23 కావడం దురదృష్టకరమని వైద్యులు అంటున్నారు. 70ఏళ్ల వ్యక్తి జర్మనీ, ఇటలీ టూర్లను ముగించుకుని మార్చి ఆరో తేదీన ఢిల్లీకి తిరిగి వచ్చారు. తర్వాత అక్కడి నుంచి పంజాబ్‌కు చేరుకున్నారు. 
 
ఆయనతో పాటు మరో ఇధ్దరు స్నేహితులు ఉన్నారు. ఇతను ఆ తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యే సరికి కనీసం 100 మందిని కలిశారు. ఆయన, ఆయన ఇద్దరు స్నేహితులు కలసి కనీసం 15 గ్రామాలను సందర్శించారు. 
 
మరోవైపు మృతుడి కుటుంబంలో 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఆయన మనవడు, మనవరాలు ఎంతో మందిని కలిశారు. దీంతో వీరంతా ఎవరెవరిని కలిశారో ట్రాక్ చేసే పనిలో అధికారులు పడ్డారు. 15 గ్రామాలను పూర్తిగా దిగ్బంధించారు. 
 
ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా ప్రభావంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా ప్రకటన చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 75 కొత్త కేసులు నమోదయ్యాయని, నలుగురు మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కాగా, భారత్ లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 851కి చేరింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 20 మరణాలు సంభవించాయి.